కరెంట్ అఫైర్స్
ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి పొందిన ప్రిన్స్ ఆగాఖాన్ (88) పోర్చుగల్లోని లిస్బన్లో 2025, ఫిబ్రవరి 4న మరణించారు. ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని. ఈయన షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ అనువంశిక ఇమామ్ (ఆధ్యాత్మిక గురువు). మనదేశంలో సామాజికాభివృద్ధికి ఏకేడీఎన్ అందించిన విశిష్ట సేవలకుగాను ప్రభుత్వం 2015లో ఆగాఖాన్కు రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మవిభూషణ్’ ను ప్రదానం చేసింది.
పినాక బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్), మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) తో రక్షణ శాఖ 2025, ఫిబ్రవరి 6న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.10,147 కోట్లు. దీంతోపాటు రక్షణ శాఖ శక్తి సాఫ్ట్వేర్ మెరుగుదలకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
అమెరికా ఐటీ కంపెనీ వర్చూసా కార్పొరేషన్ అధ్యక్షుడు, సీఈఓగా భారత సంత తికి చెందిన నితీశ్ బంగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న సంతోష్ థామస్ రాజీనామా చేయడంతో ప్రస్తుత నియామకం జరిగింది.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్లో చైనా రెండో స్థానంలో ఉంది. 2023లో ఏఐ కార్యకలాపాలకు సంబంధించి చైనా 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. బ్రిటన్ మూడో స్థానంలో ఉండగా, భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో దాదాపు 150 డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వం రూ.10,372 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ ను చేపట్టింది.