✅ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024’ ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంగ్ కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై (136) నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ (164), చెన్నై (189), బెంగళూరు (195), హైదరాబాద్ (202) ఉన్నాయి.
✅FV 25లో భారత వృద్ధిరేటు 7.2%
భారత వృద్ధిరేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.2శాతంగా ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. మార్చిలో 7శాతంగా ఉంటుందని అంచనా వేయగా తాజాగా దానిని సవరించింది. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిరేటు 6.5%, 6.2%గా నమోదు కావొచ్చని పేర్కొంది. ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ FY25లో భారత వృద్ధిరేటు 7%గా పేర్కొనగా, S&P గ్లోబల్ 6.8%గా, మూడీస్ 6.6%గా, డెలాయిట్ 6.6శాతంగా పేర్కొన్నాయి.
✅డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీ!
కొరియర్ డెలివరీ సంస్థ బ్లూడార్ట్ దేశవ్యాప్తంగా డ్రోన్ల సేవలను ప్రారంభించింది. దీని కోసం డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2021లో తెలంగాణలో ఔషధాలను డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ చేసినట్లు తెలిపింది.
✅భారత్‌లో పెరిగిన సముద్ర ఉత్పత్తులు:-
భారత్ నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. 2023-24 సంవత్సరంలో రూ.60,523.89కోట్ల విలువైన 17.82లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని, పరిమాణం పరంగా 2.67% వృద్ధి నమోదైందని ఎంపెడా ఛైర్మన్ డీవీ స్వామి తెలిపారు. 2022-23 సంవత్సరంతో పోలిస్తే ఎగుమతుల విలువ రూ.4,446కోట్లు తక్కువ. మత్య్స ఉత్పత్తుల్లో ప్రధాన దిగుమతి దారుగా అమెరికా తొలి స్థానంలో ఉంది.
Official Watsaap channel link For more Updates
✅భారత సంతతివారితో అమెరికాకు మేలు:
అమెరికా జనాభాలో 1.5% ఉన్న భారత సంతతివారితో ఆ దేశ ఆర్థికాభివృద్ధికి మేలు జరుగుతోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వారినుంచి 25 వేల కోట్ల నుంచి 30వేల కోట్ల డాలర్లు అందుతున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని 648 యూనికార్న్ లలో 72 సంస్థల కో ఫౌండర్స్ భారతీయులవేనని నివేదిక పేర్కొంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 16 సంస్థలకు భారత సంతతివారే సీఈవోలుగా ఉన్నట్లు తెలిపింది.
✅2026నాటికి భారత్‌లో ఎయిర్‌బస్ హెలికాప్టర్ తయారీ
2026 నాటికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో కలిసి ఎయిర్‌బస్ హెలికాప్టర్లు తయారు చేయనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. అసెంబ్లింగ్ లైన్‌ను ఎక్కడ నెలకొల్పేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఇంధన సంస్థల అవసరాల కోసం H145 హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది.
🟢Science and technology current affairs:-
✅జపాను వణికిస్తున్న బ్యాక్టీరియా
శరీరంలోని మాంసాన్ని తింటూ 48 గంటల్లోనే మనిషిని చంపగలిగే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) బ్యాక్టీరియా జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. అక్కడ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని సైంటిస్టులు తెలిపారు. పరిశుభ్రతతో దీన్ని అడ్డుకోవచ్చని అంటున్నారు.
లిఫ్ట్‌లో అంతరిక్షానికి.. జపాన్ కంపెనీ ప్లాన్!
మనుషుల్ని రోదసికి లిఫ్ట్ పంపించేందుకు జపాన్ కు చెందిన ఒబయాషీ కార్పొరేషన్ సంస్థ ప్లాన్ చేస్తోంది. భూమి నుంచి శాటిలైట్ వరకు కేబుల్ వేసి దాని ద్వారా 96 వేల కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహం వద్దకు చేర్చాలనుకుంటోంది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. 2050కల్లా దీన్ని సాధ్యం చేయాలని భావిస్తోంది.
నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణం
గ్రీన్లాండ్, అంటార్కిటికాలోని మంచు కరిగిపోవడంతో భూభ్రమణం నెమ్మదించినట్లు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. భూఉపరితలంతో పోలిస్తే అంతర్భాగం భ్రమణం 2010 నుంచి తగ్గిందంటున్నారు. ఇది సమయంపై ప్రభావం చూపనుందని తెలిపారు.
✅తూనీగలకు క్యాన్సర్ గుర్తించే శక్తి!
శ్వాసను బట్టి మనకు లంగ్ క్యాన్సర్ ఉందా? లేదా? అని గుర్తించే శక్తి తూనీగలకు ఉందని సైంటిస్టులు తేల్చారు. శునకాల మాదిరిగానే కీటకాలు కూడా వాసనలను సరిగ్గా పసిగట్టగలవని మిషిగన్ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. లంగ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి శ్వాస ద్వారా బయోమార్కర్లను తూనీగలు గుర్తించాయని వెల్లడించారు.
కూలింగ్ క్లాత్ అభివృద్ధి
సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే వస్త్రాన్ని షికాగోలోని ప్రీజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజినీరింగ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ క్లాత్ శరీర ఉష్ణోగ్రతను 14డిగ్రీల ఫారన్ హీట్ల మేర తగ్గించగలదట. క్లాత్, బిల్డింగ్, కార్ డిజైన్, ఫుడ్ స్టోరేజీకి ఈ వస్త్రాన్ని వాడవచ్చని చెబుతున్నారు.
వీర్యంలో మైక్రో ప్లాస్టిక్
ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు విస్తరిస్తోంది. న్యూ మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాల్లో మైక్రో ప్లాస్టిక్ రేణువులను గుర్తించగా.. తాజాగా చైనా పరిశోధకులు వీర్యకణాల్లోనూ ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు. పాలీ ఇథైలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టెరీన్ వంటి రేణువులు వీర్యంలో ఉన్నట్లు తెలిపారు. సంతానోత్పత్తికి తోడ్పడే శుక్రకణాల కదలికలకు ప్లాస్టిక్ రేణువులు అడ్డుకుంటాయని, శుక్రకణాల ఎదుగుదల, నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని సైంటిస్టులు హెచ్చరించారు.
✅
బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్ అభివృద్ధి
దివ్య దృష్టి పేరుతో అత్యంత కచ్చితత్వంతో ఒకేసారి బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్‌ను ఓ మహిళా స్టార్టప్ అభివృద్ధి చేసింది. డేర్ టు డ్రీమ్ 2.0 పేరుతో దేశవ్యాప్తంగా DRDO నిర్వహించిన పోటీల్లో ఈ టూలు అవార్డు లభించింది. బెంగళూరులోని DRDO ప్రయోగశాల సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ గైడెన్స్‌తో మహిళా పారిశ్రామికవేత్త శివానీ వర్మ నేతృత్వంలోని బృందం ఈ టూల్‌ను అభివృద్ధి చేశారు.
రక్త పరీక్షతో పార్కిన్సన్ నిర్ధారణ
రక్త పరీక్షతో 7 ఏళ్ల ముందే పార్కిన్సన్ వ్యాధిని గుర్తించవచ్చని యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధిని ముందుగా పసిగట్టే మెషీన్ లెర్నింగ్‌ను వారు అభివృద్ధి చేశారు. రోగుల మెదడులోని ఆల్ఫా సినిన్ ప్రొటీన్ ప్రొఫైల్‌తో రక్త నమూనాలను మెషీన్ లెర్నింగ్ విధానంలో పోల్చి పార్కిన్సన్‌ను గుర్తించారు.
మూన్‌పై రష్యా, చైనా పరిశోధనా కేంద్రం
ఇంటర్నేషనల్ మూన్ రీసెర్చ్ సెంటర్ నన్ను చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించనున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టును చంద్రుడి ఉపరితలంపైనా, మూన్ కక్ష్యలోనూ, భూమిపై రెండు దశల్లో నిర్మిస్తారు.
✅
జులైలో జీశాట్ N2 ప్రయోగం
ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జులై నెలాఖరులో జీశాట్ N2 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. 4700 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. దేశంలోని మారుమూల రాష్టాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్, ఇనెట్ సేవలను అందించేందుకు దీనిని అభివృద్ధి చేశారు. ఇది 15 ఏళ్లపాటు సేవలందించనుంది.
2500 ఏళ్ల క్రితమే రూట్ మార్చిన గంగానది
గంగానది 2500ఏళ్ల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం వెల్లడించింది. భారీ భూకంపం కారణంగానే ఇలా జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం గంగానది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని, ఉపగ్రహ చిత్రాలు, వివిధ పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.
వంతెన నిర్మాణంలో త్రీడీ టెక్నాలజీ
దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు 3డీ టెక్నాలజీతో వంతెన నిర్మించారు. ఈ టెక్నాలజీతో బ్రిడ్జీలను నిర్మించవచ్చని చెబుతున్నారు. నిర్మాణాల్లో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగించడానికి సింప్లిఫోర్జ్ స్టార్టప్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు IITH డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు.
✅
ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం
ఏపీ అడ్వొకేట్ జనరల్(AG)గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబు నియమించారు. 2014-19 మధ్య ఆయన ఏజీగా పనిచేశారు. మరోవైపు ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు.
GWEC ఇండియా ఛైర్మన్‌గా గిరీశ్ తంతి
గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్(GWEC) ఇండియా చైర్మన్ గిరీశ్ తంతి నియమితులయ్యారు. ఆయన సుజ్ఞాన్ ఎనర్జీ సంస్థలో వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్ విపణిగా, సముద్ర తీర గాలితో 46గిగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా భారత్ ఎదగడానికి గిరీశ్ తంతి కీలక పాత్ర పోషిస్తారని GWEC తెలిపింది.
BSNL డైరెక్టర్‌గా సుధాకరరావు
BSNL డైరెక్టర్ సుధాకరరావు పాపను నియమించారు. అంతకుముందు ఆయన చెన్నై టెలికాం డిస్ట్రిక్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ విధులు నిర్వహించారు. సుధాకరరావు చిన్న, మధ్యతర, కార్పొరేట్ క్లయింట్ల నుంచి వ్యాపారాన్ని పర్యవేక్షిస్తారు. కస్టమర్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్ట్ క్రియేషన్కి ఇంఛార్జీగా ఉంటారు.
✅
ఆర్బీఐకి అంతర్జాతీయ అవార్డు
RBIకి అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ ‘సెంట్రల్ బ్యాంకింగ్’ RBI కి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
TG, AP రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడమీ 2024కి గాను 23 మంది రచయితలకు యువ పురస్కార్ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుకు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ ఎంపికయ్యారు. ఆయన గిరిజనుల జీవిత గాథలపై ‘ఢావ్లో’ అనే కథా సంకలనాన్ని రచించారు. అటు ఏపీలోని వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌ను ‘మాయాలోకం’ నవలకు గాను బాలసాహిత్య పురస్కారం వరించింది. సాహిత్య అకాడమీ వీరికి రూ.50వేలు, జ్ఞాపిక ఇవ్వనుంది.
సుబ్బయ్య నల్లమోతుకు జాతీయ పురస్కారం
వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు వి.శాంతారం జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్రమంత్రి ఎల్. మురగన్ ఈ అవార్డును ప్రకటించారు. వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో సుబ్బయ్యకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించారు.
SHARE